రాష్ట్రంలో కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారంటూ వైఎస్ షర్మిల వైఎస్ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రాంతీయ పార్టీలు నియంతల్లా మారి బడుగు బలహీన వర్గాలను ఇతరులతో సమానంగా చూడటం లేదన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ మారిపోయాడని కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేస్తే.. నేడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా.. రాష్ట్రం మొత్తం బీజేపీ వశం అయిపోయిందని విమర్శించారు.
జగన్, చంద్రబాబు ఇద్దరూ బీజేపీకి బానిసలుగా మారిపోయారని విమర్శించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, ఒక మతాన్ని అవమానించి మరో మతాన్ని రెచ్చగొడతారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి చలి కాల్చుకుంటారని బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టానని, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి వచ్చానని అన్నారు షర్మిల.

వైసీపీ కష్టాల్లో ఉంటే 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు షర్మిల. ఆ పార్టీకి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి వైసీపీని నిలబెట్టానని అన్నారు. కానీ, ఇప్పుడు తనపైనే దాడులు చేస్తున్నారని, అయినా పర్లేదని అన్నారు షర్మిల. తనను ఎంతలా హింసించినా.. అవమానించినా.. తన కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు వైఎస్ షర్మిల.