ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన రాయుడు.. 10 రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను ఆశించిన సీటు దక్కలేదని, దాంతోనే పార్టీ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరగ్గా.. రాయుడు మాత్రం రాజకీయాల నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే వైసీపీలో ఇలా చేరి.. అలా బయటకు వచ్చిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.
పార్టీ సహా వచ్చే ఎన్నికల పరిస్థితిపై ఆయన చర్చించినట్టు తెలిసింది. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన పవన్‌తో గంటన్నర పాటు చర్చించారు. తాజా రాజకీయాలతో పాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆయన వినాయకుని వెండి ప్రతిమను అందించారు. భేటీ అనంతరం అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రాష్ట్ర ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. ‘‘వైసీపీతో ప్రయాణం చేయలేను. నా ఐడియాలజీ వేరు. వైసీపీ ఐడియాలజీ వేరు. అందుకే బయటకు వచ్చేశాను’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. వైసీపీతో ప్రయాణం చేయడం వల్ల తన ఆలోచనలు నెరవేరేలా కనిపించడం లేదన్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సూచనల మేరకు పవన్‌కల్యాణ్‌ను కలిసినట్టు తెలిపారు. తాను దుబాయ్‌లో జరగనున్న క్రికెట్ టోర్నమెంట్‌కు వెళ్తున్నట్లు రాయుడు వెల్లడించారు.