ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు రావడం అనేది ఓ ఆనవాయితీ. పాతనీరు పోవడం.. కొత్త నీరు రావడం అలా జరిగిపోతూ ఉంటుందంతే.! మొన్నటి వరకు ఏ సినిమాలో చూసినా అయితే శ్రీలీల.. లేదంటే మృణాళ్ కనిపించేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ కాకుండా.. మరో ముగ్గురు నలుగురు కొత్త ముద్దుగుమ్మలు రేసులోకి వచ్చేసారు.
మరి వాళ్లెవరు.? కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కష్టపడిన శ్రీలీల.. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవడం.. కొత్త ఆఫర్స్ కోసం వేచి చూస్తున్నారీ బ్యూటీ. మరోవైపు మృణాళ్ ఠాకూర్ ఆచితూచి కొత్త సినిమాలు సైన్ చేస్తున్నారు. ఈ గ్యాప్‌లోనే ఆషికా రంగనాథ్ సహా మరో ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్‌పై కన్నేసారు.
అమిగోస్ సినిమాతో పరిచయమైన అషికా రంగనాథ్.. నా సామిరంగాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు ఈ కన్నడ కస్తూరి. ప్రస్తుతం అషికాకు తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మరోవైపు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య సైతం సిద్ధూ జొన్నలగడ్డ, ఆశిష్ రెడ్డి, ఆనంద్ దేవరకొండ సినిమాలలో నటిస్తున్నారు.