డ్రగ్ కేసులో షణ్ముఖ్, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకుని అతడి అన్న సంపత్ వినయ్ ఇద్దరు తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది మౌనిక. ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన డాక్టర్ మౌనికకు మూడేళ్ల క్రితం షణ్ముక్ అన్న సంపత్‌తో పరిచయం అయ్యింది.
మౌనికను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంపత్.. ఆమెని హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లోబర్చుకున్నాడు. ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు. అయితే ఈ విషయాలేవి బయటపెట్టడకూడదని బెదిరించాడని బాధితురాలు మౌనిక చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని అడిగితే.. చేతికి ఓ ఉంగరం తొడిగి వివాహం అయ్యిందని చెప్పాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. కానీ మౌనిక తల్లి క్యాన్సర్ బారిన పడటంతో ఆమె చికిత్స కారణంగా వీరి వివాహం పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.

ఇక తాజాగా మౌనిక-సంపత్‌లు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి.. పెళ్లికి ముహుర్తం కూడా పెట్టుకున్నారు. వీరి వివాహానికి మరో ఆరో రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఈలోపే సంపత్.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మౌనిక నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. వారు సంపత్ కోసం అతడి ఇంటికి వెళ్లగా.. అదే సమయంలో షణ్ముఖ్, అతడి అన్నతో కలిసి గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే అన్నదమ్ములు చాలా కాలం నుండి గంజాయి వాడుతున్నారని.. వారి దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది మౌనిక.