వెంకటేశ్, రానా, కుటుంబ సభ్యులపై కేసు నమోదు, కోర్టు ఏం చెప్పిందో తెలుసా..?

అప్పట్లో జరిగిన విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు హైకోర్టుకి హాజరు కాకపోవడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ స్టే ఆర్డర్ ఉండగా అధికారులు ఎలా కూల్చివేస్తారని హైకోర్టు నిలదీసింది. ఆదివారం, సెలవు రోజుల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు పట్టించుకోలేదని ధర్మాసనం జీహెచ్‌ఎంసీపై మొట్టికాయలు వేసింది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది.

వెంకటేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నందకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని తెలిపారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ హోటల్ ను కూల్చేయించారని చెప్పారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేశ్, కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *