త్వరలో పవన్ విజయవాడ రానున్నారు. జనసేన పార్టీ నేతలతో ఆయన సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. దీపావళి తర్వాత జనంలో టీడీపీ- జనసేన వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించారు.
అయితే ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో పరామర్శించిన తరువాత అదే జైలు ప్రాంగణం నుంచి టీడీపీతో కలిసి పోటీ చేయనున్నామని తొలిసారిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత టీడీపీ-జనసేన యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఇప్పుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పరామర్శించిన పవన్ కళ్యాణ్ కీలకాంశాలపై చర్చించారు.
ముఖ్యంగా రెండు అంశాలపై చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో, ఇతర కార్యక్రమాలపై చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాలు మంతనాలు సాగాయి. టీడీపీ గతంలో ప్రకటించిన ఆరు హామీలకు తోడు ఇతర హామీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకై చర్చించుకున్నారు.