గోరంట్ల మాధవ్ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అనంతపురం జిల్లా రాజకీయాల్లోకి సులువుగా ప్రవేశించగలిగారు. గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రాకముందు కదిరి సీఐగా పనిచేశారు. ఆయన పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
ఆ సమయంలో జేసీ సోదరుల పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించడం, మీసం మెలేయడంతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. పోలీసులను అంటే నాలుక చీరేస్తానంటూ హెచ్చరించారు. ఆ సమయంలోనే వైసీపీ అధినేత జగన్ కంట్లో పడ్డారు. దీంతో జగన్ సూచన మేరకు 2018లో ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
2019 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు టిక్కెట్ ను గోరంట్ల మాధవ్ కు జగన్ పిలిచి ఇచ్చారు. ఊహించినట్లుగానే ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి గోరంట్ల మాధవ్ కు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. ఒక సీఐ ఒక ఏడాదిలో పార్లమెంటుకు వెళ్లడం ఆయనతో పాటు కుటుంబం కూడా ఊహించి ఉండరు. రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకి వెళుతున్నాడేమో అని కుటుంబ సభ్యులు కూడా వారించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.