కవితను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని మధ్యాహ్నం నుంచే టాక్ నడుస్తూ వచ్చింది. కవిత ఇంట్లో అధికారుల సోదాలు.. ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించడంతోనే ఇవాళ కీలక పరిణామమే జరుగుతుందని అందరూ ఊహించారు. దీనికి తోడు కవిత, ఆమె భర్త అనిల్.. సహాయకుల ఫోన్లు మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
అయితే.. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మార్చి-19న విచారణ ఉండటంతో.. అంతవరకూ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని బీఆర్ఎస్ వర్గాలు ధీమాతోనే ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి ఏక కాలంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడింది.
దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు కాదు గతంలో ఢిల్లీ వేదికగా ఈడీ విచారణ జరిగినప్పుడే అరెస్ట్ చేయాల్సింది,.. ఆలస్యమైందంటూ కాంగ్రెస్ నేతలు సెటైర్లేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు మాత్రం కచ్చితంగా అరెస్ట్ ఉంటుందన్నట్లుగా చెబుతూ వస్తున్నారు.