వచ్చే ఎన్నికల్లో కుప్పంతో సహా 175 సీట్లు గెలవాలని టార్గెట్‌గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్‌లు ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అక్కడి ఎమ్మెల్యేలు, ఇంచార్జిల పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వాటి ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే వచ్చే ఏడాది మార్చిలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం జగన్ అన్నారు. సుమారు 15 రోజుల నుంచి 20 రోజుల ముందుగానే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముందే జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఎన్నికలకు రెడీగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.
ఇప్పటికే మన పార్టీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నా మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థంగా పనిచేయాలని తెలిపారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ తమ మంత్రులతో చెప్పారు. కాగా 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా మే 23న ఫలితాలు వచ్చాయి. సీఎం జగన్ చెప్పిన ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.