గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది.
ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
గరుడ పురాణం చదవడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూమతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను కూడా ప్రస్తావించారు. గరుడ పురాణంలో చెప్పబడిన ఈ అంశాలను అనుసరించడం ద్వారా కుటుంబానికి సంతోషం శ్రేయస్సు కలుగుతాయి.