చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఆమె రచయిత్రి కూడా! డాక్టర్ గాలి బాల సుందర రావు ఏకైక కుమార్తె. ఇక, చంద్ర మోహన్ తల్లిదండ్రుల విషయానికి వస్తే… శాంభవి, మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి. వాళ్ళది కృష్ణా జిల్లాలోని పమిడి ముక్కల గ్రామం. మే 23, 1942లో ఆ దంపతులకు మల్లంపల్లి చంద్ర శేఖర రావు జన్మించారు. ప్రేక్షకుల ముందుకు చంద్ర మోహన్ పేరుతో వచ్చింది ఆయనే. అయితే ప్రముఖ సీనియర్ నటుడు, అలనాటి హీరో చంద్రమోహన్ హఠాన్మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం కన్నుమూశారు.
చంద్రమోహన్ మరణవార్తతో టాలీవుడ్ తల్లడిల్లుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రమోహన్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నటుడి భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. ఆయనను చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలపై కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంటే మరణించిన మూడో రోజున చంద్ర మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అయితే ఆయన అంత్యక్రియలు రెండు రోజుల పాటు ఆలస్యంగా జరగడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. చంద్ర మోహనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి. ఈమె ప్రస్తుతం అమెరికాలో సైకాలజిస్టుగా పని చేస్తున్నారు. ఇక చిన్న కూతురు మాధవి చెన్నైలో సెటిల్ అయ్యింది. అయితే పెద్ద కూతురు మీనాక్షి తండ్రి అంత్యక్రియల కోసం రావడానికి సమయం పడుతోందని తెలుస్తోంది. అందుకే రెండు రోజులు లేట్‌గా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్ర మోహన్ అంత్య క్రియలు సోమవారం నిర్వహించడానికి మరో ప్రధాన కారణం.. ఆదివారం దీపావళి పండగ ఉండడం.

పండగను పెట్టుకుని అంత్యక్రియలుకు ఎవరూ వచ్చే అవకాశం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. అభిమానులు కూడా చంద్ర మోహన్‌ను కడసారి చూసేందుకు రాలేరని భావించి సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారట. ఈ రెండు కారణాలతోనే చంద్ర మోహన్ అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోనే చంద్ర మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.