గత నెల 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు 25 లక్షల మంది భక్తులు రామచంద్రుడిని దర్శించుకున్నట్లు అయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ తెలిపింది. ఆలయానికి ఇప్పటివరకు రూ.11 కోట్లకుపైగా విరాళాలు సమకూరాయని ట్రస్ట్ వెల్లడించింది. అయితే రామమందిర ప్రతిష్ఠాపన జరిగి 11 రోజులైంది. సంప్రోక్షణ కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు రామజన్మభూమిని దర్శించుకున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో గత 10 రోజుల్లో సుమారు ₹8 కోట్లు విరాళాలు హుండీల్లో జమ అయ్యాయని, ఆన్‌లైన్‌లో సుమారు ₹3.50 కోట్లు అందాయని తెలిపారు.
ఈ విషయం గురించి ట్రస్టు కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ స్వామి కొలువై ఉన్న గర్భగుడి ముందు దర్శన మార్గానికి సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళాల బాక్స్‌లను ఉంచామని, అందులో భక్తులు విరాళాలు వేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లలో కూడా ప్రజలు విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. ఆలయ ట్రస్ట్ ఉద్యోగులను అన్ని విరాళాల కౌంటర్లలో నియమించారు, సాయంత్రం కౌంటర్ మూసివేసిన తర్వాత ట్రస్ట్ కార్యాలయంలో వచ్చిన విరాళం మొత్తం ఖాతాను సమర్పిస్తారు.

11 మంది బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు సహా 14 మంది ఉద్యోగుల బృందం నాలుగు విరాళాల బాక్స్‌ల్లో ఉన్న కానుకలను లెక్కిస్తున్నారు. విరాళాలు లెక్కించడం అంతా సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్నాయని గుప్తా తెలిపారు.భక్తులు రాంలాలాను దర్శించుకునే మార్గంలో బిజోలియా రాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి సీజన్‌లో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన బిజోలియా రాళ్లపై భక్తులు హాయిగా నడిచే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.