వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలు రాజకీయ కుట్రలో భాగమేమని వైఎస్ సునీతా రెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు న్యాయం చేయాలని ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజంటేషన్ ఇచ్చారు. వివేకా హత్య రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు.
అందులో భాగంగానే రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్స్ కలుస్తున్నానన్నారు. తనకు ఫేవర్ చేయాలని ఎవరిని కోరడంలేదని, తన తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. సీబీఐ, కోర్టులలో న్యాయం ఆలస్యం అవుతుందన్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నానని సునీత చెప్పారు. అవినాష్ రెడ్డి లాంటి హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని ఆమె అన్నారు.
2019 ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసం తన తండ్రి వివేకాను అతి దారుణంగా హత్య చేశారని సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రతికారం తీర్చుకోవడం తన ధ్యేయం కాదన్న సునీతా రెడ్డి…అప్పుడే కడపకు వెళ్లి తానే నరికేసే దానిని అని సంచలన వ్యాఖ్యలు చేశారు.