అర్ధరాత్రి బాత్రూం కిటికీ పగలగొట్టి లేడీస్ హాస్టల్లోకి అబ్బాయిలు, తర్వాత ఏం చేసారంటే..?

అర్ధరాత్రి బాత్రూం కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి, విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తమై ఒకర్ని పట్టుకుని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరో దుండగుడు పారిపోయాడు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సికింద్రాబాద్‌ పీజీ కాలేజీ లేడీస్‌ హాస్టల్‌లోకి శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు చొరబడి కలకలం సృష్టించారు. కిటికీ పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో పలువురు విద్యార్థినులు నిద్రపోతుండగా, కొందరు చదువుకుంటున్నారు.

ఒక్కసారిగా కిటికీలోనుంచి వచ్చిన వ్యక్తులను చూసి వారు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. కొందరు విద్యార్థినులు ధైర్యం చేసి.. ముగ్గురు దుండగులలో ఒకడిని పట్టుకొని బంధించారు. 100 నెంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున విద్యార్థినులు అక్కడికి చేరుకోవటంతో మిగిలిన ఇద్దరు దుండగులు పరారయ్యారు. పట్టుకున్న వ్యక్తిని పోలీసులు విచారించగా.. అతడి పేరు శ్రీకాంత్‌ అని, సమీపంలోని వాటర్‌ వర్క్స్‌ కార్యాలయంలో నీళ్ల ట్యాంకర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పారిపోయిన ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

దుండగుల చొరబాటు నేపథ్యంలో విద్యార్థినులు శనివారం పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. హాస్టల్‌లో తమకు రక్షణ కరువైందని, హాస్టల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నార్త్‌జోన్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అక్కడకు చేరుకుని ప్రిన్సిపాల్‌ రవికుమార్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్‌ పికెట్‌ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పటంతో విద్యార్థినులు నిరసన విరమించారు.

ఓయూలోని పలు విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణలో ఓయూ వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *