ఒకే సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ లో విలనిజానికి కిక్కెక్కిచ్చిన నటుడు. అంకుశం సినిమాలో నీలకంఠం పాత్రలో నమస్తే బాయ్.. నేను మామూలుగా ఎవ్వరికీ నమస్తే పెట్టను కానీ.. పెడుతున్నా అంటూ అంకుశం సినిమాలో అసలైన విలనిజాన్ని ప్రదర్శించారు. అయితే స్పాట్ పెడ్తా.. ఇప్పటివాళ్లకు ఏమో కానీ.. 90వ దశకంలో ఈ డైలాగ్ విననివాళ్లు, అననివాళ్లు ఉండరు. ‘అంకుశం’ మూవీతో నటుడిగా పరిచయమయిన రామిరెడ్డి ట్రేడ్ మార్క్ డైలాగ్ ఇది. ఆ చిత్రంలో విలన్ రోల్‌లో ఒదిగిపోయారు ఈ యాక్టర్.
అందులో రామిరెడ్డి పలికిన స్పాట్ పెడ్తా అన్న డైలాగ్ విపరీతంగా ఫేమస్ అయ్యింది. ఫస్ట్ మూవీనే బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఆయనకు వరుసగా అవకాశాలొచ్చాయి. తెలుగు మాత్రమే కాదు అటు బాలీవుడ్‌లో సైతం సత్తా చాటారు. ఇక తమిళం, మలయాళం, కన్నడ, భోజ్‌పురి భాషల్లోనూ తన మార్క్ చూపించారు. 250కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు రామిరెడ్డి. ఆయన చివరి చిత్రం ‘మర్మం’. ఎక్కువ విలన్‌గానే కనిపించినా ‘పెద్దరికం’, ‘అనగనగా ఒక రోజు’ లాంటి సినిమాల్లో మాత్రం టిపికల్ రోల్స్ చేశారు.
అనగనగా ఒక రోజు, అడవిచుక్క, నాగప్రతిష్ఠ, తెలుగోడు, జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా, వీడు మనవాడే ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు. కాలేయ సంబంధ వ్యాధి కారణంగా 55 ఏళ్ల వయస్సుకే 2011లో ఆయన కన్నుమూశారు. వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి నరకం అనుభవించారు. గుర్తుపట్టేలేనంత సన్నగా అయిపోయారు. చాలాకాలం పాటు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కుని 2011, ఏప్రిల్ 14న కన్నుమూశారు. రామిరెడ్డి చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని ఓబుళంవారిపల్లెలో జన్మించాడు.
ఆయన చదువంతా హైదరాబాదులోనే సాగింది. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో పట్టా పొందిన ఈయన నటుడు కాక మునుపు ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రామిరెడ్డి మంచి బాస్కెట్‌బాల్ ప్లేయర్ కూడా. కోడి రామకృష్ణ తీసిన చిత్రాల్లో రామిరెడ్డికి మంచి పాత్రలు దక్కాయి.