తేజస్విని మనోజ్ఞ 1994 మే 19న హైదరాబాద్ లో జన్మించారు. రోసరీ కాన్వెంట్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి, 2017లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తేజస్విని ప్రస్తుతం వైద్యురాలిగా ప్రజలకు సేవలందిస్తోంది. మనోజ్ఞ భరతనాట్య నృత్యకారిణి. జాతీయ స్థాయిలో దూరదర్శన్, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి గ్రేడెడ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా ఆమె జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ పీ జె అబ్దుల్ కలాం ముందు భరతనాట్యం ప్రదర్శించి ప్రశంసలను పొందింది. మనోజ్ఞ ఒక నాట్యకారిణే కాకుండా, గాయని కూడా. దేశవిదేశాల్లో అనేక కచేరీలు, వర్క్ షాప్ ఇవ్వడం జరిగింది. మనోజ్ఞ పాడి, నటించిన ఆల్బమ్ సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. తేజస్విని యోగా టీచర్ కూడ. 2017లో మిస్ దివా – 2017 పోటీల కోసం మనోజ్ఞ ఆడిషన్ నిర్వహించింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు.
మిస్ ఎర్త్ ఇండియా 2019 కిరీటాన్ని గెలుచుకున్న మనోజ్ఞ మిస్ ఎర్త్ 2019 పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఫిలిప్పీన్స్లో జరిగిన పోటీలో పాల్గొన్నది.