కన్న బిడ్డలపైన ఎన్నో ఆశలు పెట్టుకుని వారిని పెంచుతూ ఉంటారు. వారు సరైన మార్గంలో నడవకపోతే సరిదిద్దుతారు. వారి మధ్య కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చినా సర్దుకుపోతారు. ఈ క్రమంలో తమ కడుపున పుట్టిన పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే.. కన్న వారి బాధ ఎవరు తీర్చలేరు. అయితే కడుపున పుట్టిన నలుసులను తల్లి ఎంతో ప్రేమగా, పెంచి పెద్ద చేస్తుంది. వారు ఉన్నత స్థానాలకు వెళ్తే మురిసిపోతుంది. కన్న బిడ్డలకు చిన్న కష్టం వచ్చినా.. తల్లి అల్లాడిపోతుంది.
అలాంటిది నవమాసాలు మోసిన కొడుకు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడు అంటే ఏ తల్లీ తట్టుకోలేదు. అందుకే కుమారుడి మరణవార్త విని ఓ తల్లి గుండె ఆగిపోయింది. కన్నీరు పెట్టించే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట్ మండలం షేర్మహ్మద్ పేట గ్రామంలోని ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు తిరుపతిరావు. అయితే అతను కొంతకాలంగా కామెర్లబారిన పడి అనారోగ్యానికి గురయ్యాడు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి తిరుపతిరావు మృతి చెందాడు.

కొడుకు మరణవార్తను విన్న తల్లి తిరుపతమ్మ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు విడిచింది. తల్లీకొడుకు అరగంట వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బిడ్డ మరణాన్ని తట్టుకోలేక తల్లి గుండె ఆగిపోయిన ఘటన గురించి తెల్సి పలువురు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అమ్మ ప్రేమను మించినది మరొకటి లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.