వైసీపీ ఒక్కో ఓటుకి రూ.3,500 పంపిణీ చేసిందని, ఓటర్లను ఆ పార్టీ నేతలు ప్రలోభ పెట్టారని మండిపడ్డారు షర్మిల. ఇక తనకు టైమ్ తక్కువగా ఉండటం కూడా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తాను అన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చిందని, అందుకే కడపలో ఎక్కువ మంది ప్రజలకు చేరువ కాలేకపోయానని అన్నారు షర్మిల. అయితే రాష్ర్టంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని, ఒత్తిడి తేవాలని సూచించారు. గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ తన మాట నిలుపుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండేది కాదని చెప్పారు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కల అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు.
అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు 2018నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి పూర్తి చేయలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. పోలవరం ప్రాజక్ట్పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్డీయే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. తన ఓటమికి కారణం సమయం లేకపోవడమేనని వైఎస్ షర్మిల చెప్పారు. కేవలం 14 రోజులు మాత్రమే ఎన్నికల్లో ప్రచారం చేశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తుందని కడపలో చాలా మందికి తెలియదన్నారు.