కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్దవెంకమ రాజు రత్నాకరమ్. బాబాకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. బాబా చిన్న వయసులోనే చాలా అద్బుతాలు చేశాడని చెబుతారు.
చిన్న వయసులోనే బాబా అపర మేధావి, సేవాభావం గల వ్యక్తిగా ముద్ర పడ్డారు. అపర మేథావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులను వినిపించాడు. 1940వ సంవత్సరం మార్చి 8వ తేదిన తన సోదరుడు శేషమ రాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందంట. ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారంట. తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా బిహేవియర్‌లో మార్పు వచ్చింది.
తనకు తాను నవ్వుకోవడం, ఏడ్వటం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారి పోవడం చేసేవారు. ఆ సమయంలో ఇతను తనకు ఇంతకుముందు ఏ మాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాబా పరిస్థితి చూసి వైద్యులు హిస్టేరియా అని నమ్మేవారు. దీంతో చేసేది లేక బాబా తల్లిదండ్రులు బాబాను పుట్టపర్తికి తీసుకు వచ్చారు. వారు బాబాను అనేకమంది వైద్యుల వద్దకు, ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకు వెళ్లారు.