చంద్రబాబు, రోజా ప్రయాణించిన విమానం విజయవాడకు చేరుకోవడానికి 10 నిమిషాల ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే విమానాశ్రయంలో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన మంగళగిరి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే గతంలో టీడీపీలోనే ఉన్న రోజా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ.. వైసీపీలోకి వెళ్లారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి రోజా తరుచుగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటంతోపాటు విమర్శలకు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఉప్పు నిప్పులా ఉండే వీరిద్దరూ ఒకే విమానంలో ప్రయాణించడం రోజాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా పరిస్థితులవల్ల తప్పనిసరై ప్రయాణించారు. అరగంటలో ప్రయాణం ముగిసింది. తిరుమల వెళ్లిన చంద్రబాబు సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం తలపెట్టే ఉద్దేశంతో తాను తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చానని చెప్పారు.
ఆయన త్వరలో ఏం చెయ్యబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ప్రజల్లోకి వెళ్లి, స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పూర్తిగా వివరిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేష్ తన యువగళం పాదయాత సెకండ్ ఫేజ్ కొనసాగిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఏం చెయ్యబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.