తెలంగాణ ఎన్నికలు -2023లో కీలక ఘట్టం పూర్తయ్యింది. గురువారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆ తర్వాత, సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్లేషించాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్ అని బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పిన సందర్భాలను ఎన్నో చూశామని, బీఆర్ఎస్ 70 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు.
ఎగ్జిట్ పోల్స్‌ను చూసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ధైర్యం చెప్పారు. అయితే కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క గెలుపుపై ఆసక్తికర వాదన వినిపిస్తోంది. నిజానికి ఆమె స్వతంత్ర అభ్యర్థి కన్నా.. బీఎస్పీ తరఫున పోటీ చేసి ఉంటే మరిన్ని ఓట్లు పడేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వే, పలు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం శిరీషాకు పది వేల నుంచి 15 వేల వరకు ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుసుతోంది.

అయితే ఆమెకు పడిన ఓట్ల కారణంగా ఎవరి గెలుపు అవకాశాలకు గండి కొడుతుందో అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. బర్రెలక్క ఓట్లు అధికార పార్టీ అభ్యర్థిని దెబ్బ తీస్తుందా, ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థిని దెబ్బ తీస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2018 ఎన్నికల్లో కూడా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావుపై కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కేవలం 12,546 ఓట్లతో విజయం సాధించారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావుకు 13,156 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.