చివరి రోజుల్లో విషాదం అంటే మనకి సావిత్రి గారు గుర్తుకు వస్తారు. సిల్క్ స్మిత జీవితం కూడా అలాగే సాగింది. అంతకి మించిన ట్రాజిడీ భగవాన్ దాదా జీవితం. ఆగష్టు 1న ఆయన జయంతి కావడంతో భగవాన్ దాదా లైఫ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి. ఆయన అసలు పేరు భగవాన్ ఆబాజి పలావ్. కుస్తీలో ఆయనకి మంచి ప్రావీణ్యం ఉంది. అయితే ఈయన కార్మికుడు, నటుడు, డ్యాన్సర్, దర్శకుడు, నిర్మాత! భగవాన్ దాదా అసలు పేరు భగవాన్ ఆబాజీ పలావ్. కుస్తీ పోటీల్లో ప్రతిభ చూపిన ఇతడిని అందరూ ముద్దుగా భగవాన్ దాదా అని పిలిచుకునేవారు.
మొదట ఈయన బాంబేలోని వస్త్ర మిల్లులో పని చేశాడు. విరామం లేకుండా పని చేస్తున్న ఈయనకు ఎప్పటికైనా సినిమాల్లోకి రావాలన్న ఆశ, ఆసక్తి రెండూ ఉండేవి. ఈ ఆసక్తితోనే సినిమా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయడం ప్రారంభించాడు. చిత్రయూనిట్‌కు భోజనం సమకూర్చడం దగ్గరి నుంచి నటీనటుల దుస్తుల ఎంపిక వరకు అన్నీ తనే స్వయంగా చూసుకుని బడ్జెట్ పెరగకుండా జాగ్రత్తపడేవాడు. 1938లో బహదూర్ కిసాన్ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశాడు.
తర్వాత చిన్నాచితకా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అవి సక్సెస్ కావడంతో తక్కువ కాలంలోనే అతడి పేరు మార్మోగిపోయింది. ఈ ధైర్యంతో భగవాన్ నిర్మాతగానూ మారాడు. ప్రేమ, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. అయితే ఏదైనా సామాజిక చిత్రం తీయమని 1951లో రాజ్‌కపూర్ సలహా ఇవ్వడంతో అల్బెలా తీశాడు. ఇది ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా అందులోని షోలా జో భడ్కే అనే పాటకు భగవాన్ వేసిన స్టెప్పులు హైలైట్ అయ్యాయి. బాలీవుడ్‌లో గొప్ప డ్యాన్సర్‌గా ఇతడిని ఇప్పటికీ చెప్పుకుంటారు.
ఇకపోతే జమేలా, భాగం భాగ్ అనే సూపర్ హిట్స్ బాలీవుడ్‌కు అందించాడు. ఊహించని విజయాలతో అతడికి పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చింది. ఒకేసారి స్టార్‌డమ్ స్టేటస్ రావడంతో విలాసాలకు బాగా ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో ముంబై జుహులో 25 గదులు ఉన్న పెద్ద బంగ్లా కొని అందులోనే నివసించాడు. వారం రోజులపాటు రోజుకో కారులో తిరిగేలా ఏడు లగ్జరీ కార్లను మెయింటైన్ చేశాడు. కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. అతడి సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. 1960 నుంచి భగవాన్.. హీరో స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచే స్థాయికి పడిపోయాడు. నెమ్మదిగా ఆ కాస్త అవకాశాలు రావడం కూడా కనుమరుగైపోయాయి.