గతంలో రాజుల కాలం ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే వారని, ఇప్పుడు కూడా అదే తరహాలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ పని ప్రచార ఆర్భాటాలకు తప్ప, క్షేత్రస్థాయిలో పని జరగడానికి పనికిరాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. ప్రజా దర్బార్ పట్ల విమర్శలు వ్యక్తం కావడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు. అయితే ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారి సమస్యల పట్ల సత్వర పరిష్కారం కోసం కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి ప్రజలు ఇక్కడి వచ్చి తమ సమస్యలను తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అయితే, తాజాగా ప్రజాదర్బార్ విషయంలో ప్రభుత్వం పలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించగా, అధికారులు దరఖాస్తుల స్వీకరణను కొనసాగించారు.
సోమవారం ఉదయం 10 గంటల లోపు ప్రజా భవన్‌కు చేరుకునే వారిని తమ దరఖాస్తులను సమర్పించేందుకు అనుమతించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని రేవంత్‌రెడ్డి అధికారులను కోరారు.