మల్లారెడ్డి తన మెడికల్ యూనివర్సిటీ కోసం అనేక భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే అనేక భూములు ఆయన పేరిట స్వాహాచేశారని, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వందలాది ఎకరాలు ఆక్రమించుకుని ధరణి వచ్చిన తర్వాత దానిని చేర్చుకోగలిగారని విమర్శలు వినిపించాయ. అంతేకాకుండా అసైన్‌మెంట్ ల్యాండ్స్ కూడా ఆక్రమించుకుని పేదల కడుపు కొట్టారంటూ అప్పట్లో విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే గిరిజనుల భూ ఆక్రమణకు నాకెలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతపల్లి మండలం కేశవరం గ్రామ సర్వే నంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమి ఆక్రమణపై కేసు నమోదు చేయడంపై ఆయన మాట్లాడారు.
ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్‌లో కానీ, పహణీలో కానీ తన పేరు ఎక్కడా లేదన్నారు. అలాంటప్పుడు తన పేరుపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఆ డాక్యుమెంట్‌లో పేరు ఉన్న వారిపై కేసు నమోదు చేస్తే సమాధానం ఇస్తారన్నారు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడినట్టు తెలిపారు. ఏసీపీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం కూడా చేస్తానన్నారు.