మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈనెల 7 అర్ధరాత్రి బాత్రూమ్‌లో జారిపడ్డారు. తుంటి ఎముకకు గాయం కావడంతో సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే హిప్ జాయింట్ రిప్లేస్‌మెంట్ తర్వాత.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.
యశోద వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గులాబీ బాస్‌కు.. రాజకీయాలకు అతీతంగా పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఇవాళ కూడా పలురంగాల ప్రముఖులు పరామర్శించారు. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఆయనను కలిసి వెళ్తున్నారు.
సోమవారం సాయంత్రం యశోద ఆస్పత్రికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. కేసీఆర్‌ను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రకాష్ రాజ్ ఆకాంక్షించారు.