ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతడిని పట్టుకోడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏసీపీ మీడియాతో మాట్లాడారు. ప్రవళిక ఆత్మహత్య విషయంలో శివరామ్‌పై 417, 420, 306 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే తెలంగాణలో సంచలనం రేపిన ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
నిందితుడు, ప్రవళిక బాయ్ ఫ్రెండ్ శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రవళిక ఘటన తర్వాత శివరాం పరార్ అయ్యాడు. ఫోన్ నెంబర్ మార్చి తప్పించుకుని తిరుగుతున్నాడు. కొత్త ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు అతడిని ట్రేస్ చేశారు. పుణెలో ఉన్నట్లు గుర్తించారు. శివరాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రవళిక కేసులో పరారీలో ఉన్న శివరాం కోసం పోలీసులు ఇతర రాష్ట్రాల్లో వెతికారు. ప్రవళిక ఆత్మహత్యపై రాజకీయ దుమారం.. ప్రవళిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో సంచలనం రేపింది.
రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రవళిక లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది. అక్టోబర్ 13న హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు. వ్యక్తిగత కారణాలే కారణం అని తేల్చిన పోలీసులు.. కాగా, పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణం అని తేల్చారు.
శివరాం వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రవళిక ఘటనలో పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్ శివరాంపై కేసు నమోదు చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు సేకరించారు. శివరాం అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవళిక కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా శివరాంపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.