రైతుబిడ్డ అంటూ ఆకాశానికెత్తారు. జనాలు సైతం తమలో ఒకడు ప్రశాంత్ అంటూ అతడికి బాగా కనెక్ట్ అయ్యారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలేలో అమర్‌దీప్‌ను ఓడిస్తూ విజేతగా అవతరించాడు ప్రశాంత్. అయితే ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపలకు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
అయితే సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ పేరు ప్రకటించగానే అతడి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఇరువురి అభిమానుల మధ్య గొడవ మొదలైంది. అది దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ గట్టిగా కొట్టుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ చెందిన ఆరు బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు అభిమానులు.
బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనలను సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతడి అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.