పిఠాపురం ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. తనను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచిందన్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాబోతోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అన్ని వర్గాల ప్రజలు జనసేన అభ్యర్థులతోపాటు కూటమి పోటీ చేసిన స్థానాల్లో మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. సోమవారం సాయంత్రం పిఠాపురం నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. న్యాయవాదులు, ప్రముఖ వైద్యులు, వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు ప్రముఖులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
సుమారు 100 మందికి పైగా పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… “జనసేన పార్టీని అర్థం చేసుకుని బలోపేతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరినీ సాదరంగా జనసేన కుటుంబలోకి ఆహ్వానిస్తున్నాం.
పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం మొత్తాన్ని కలవాలన్న ఆశ ఉన్నప్పటికీ కొన్ని భద్రతాపరమైన కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కిరాయి మూకలు సన్నటి బ్లేడులతో వచ్చి జనంలో కలసిపోయి మన మీద దాడులు చేస్తున్నారు. ప్రత్యర్థుల పన్నాగాలు గమనిస్తూ మనమంతా ముందుకు వెళ్లాలి” అని అన్నారు.