పిఠాపురం నియోజకవర్గంలోని యు. కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో పవన్ కళ్యాణ్ మంగళవారం పర్యటించారు. సుమారు 20 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన పవన్ కళ్యాణ్.. మహిళలు, రైతులు, యువతను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎండలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో జనసేనాని అస్వస్థతకు గురైనట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న పవన్.. ఎండలో తిరగటంతో మరింత అస్వస్థతకు లోనైనట్లు పేర్కొంటున్నాయి. జ్వరం తీవ్రత పెరగటంతో తెనాలి పర్యటన, ఉత్తరాంధ్ర టూర్ రద్దైనట్లు చెబుతున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది. వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని సూచించిన నేపథ్యంలో తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ ఎప్పుడు ప్రచారం నిర్వహించేదీ జనసేన తెలియజేయనుంది.