మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితినాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి.
వాటినే నవరంధ్రాలు అని అంటూ ఉంటారు. మానవశరీరంలో నాడులతో నిండిఉన్న వెన్నెముకను ‘వెన్నుబాము” అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధార చక్రంలో ‘పాము” ఆకారము వలెనే ఉంటుందని ‘యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాన్ని గ్రక్కుతూ మానవునిలోని ‘సత్వగుణసంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని,
అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్చ పుట్టలను ఆరాధించి పుట్టలో పాలుపోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివశించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా, శేషపాన్నుగా మారాలని కోరికతో చేసేదే. ఈ నాగుపాము పుట్టలో పాలుపోయుటలో గల ఆంతర్యం ఇదేనని చెబుతారు.