అయోధ్యలోని రామాలయాన్ని ఇంతవరకూ ఎక్కడా చూడని ఒక కొత్త నిర్మాణ శైలిలో నిర్మించారు. ప్రశాంతతకు … పవిత్రతకు .. శిల్ప నైపుణ్యానికి ప్రతీకగా ఈ ఆలయం కనిపిస్తోంది. గర్భాలయంలో 5 అడుగుల ఎత్తు కలిగిన ‘కృష్ణశిల’తో మలిచిన బాలరాముడి మూర్తిని ప్రతిష్ఠించారు. పద్మపీఠంపై నిలిచిన బాలరాముడి తేజస్సు … బాలభానుడితో పోటీపడుతోంది. అయితే అయోధ్యలోని రామ్ లలా ఆలయంలో పోయిన ఓ పర్సు..హరిద్వార్‌లో దొరికింది. దాదాపు 680 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. బాలరాముడి ఆశీస్సుల వల్ల పోయిన పర్సు మళ్లీ దొరికిందని.. ఆ పర్సును పోగొట్టుకున్న కుటుంబం సంబరపడుతోంది.
తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ వెంబు కుటుంబం జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లారు. ఆయన తల్లి జానకి (80) అయోధ్య ఆలయంలో పర్సును పోగొట్టుకుంది. ఆ పర్సులో రూ.63550 నగదు, ఆధార్ కార్డుతో సహా పలు వస్తువులు ఉన్నాయి. ఐతే ఆ మహిళ డబ్బు గురించి చింతించకుండా మొదట రాంలల్లాను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. సెక్యూరిటీ సహాయంతో బాల రామయ్యను కనులారా వీక్షించి దర్శనం చేసుకున్నారు.తన పర్సును తిరిగి తన దగ్గరకు చేర్చమని మనసులో బాల రామయ్యని ప్రార్థించారు. తన తల్లి పర్సు కనిపించకపోవడంతో.. శ్రీధర్ వెంబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత తంజావూరుకు సమీపంలోని తెన్‌కాశికి చేరుకున్నారు. ఐతే జానకి పోగొట్టుకున్న పర్సు అయోధ్యకు 680 కిలోమీటర్ల దూరంలోని హరిద్వార్‌లో ఒక సన్యాసి వద్ద లభ్యమైంది. హరిద్వార్‌కు చెందిన సాధువు సుధా ప్రేమానంద్ మహరాజ్ కూడా జనవరి 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐతే అనుకోకుండా ఆ వృద్ధురాలి పర్సు ఆయన బ్యాగ్‌లో పడిపోయింది. హరిద్వార్ వెళ్లాక.. తన సంచిలో ఉన్న పర్సుని గుర్తించారు. పర్సులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులను సంప్రదించారు. తన బ్యాగ్‌లో పర్సు లభ్యమైందని.. అందులో డబ్బులతో పాటు ఆధార్ కార్డు ఉందని.. వాటిని తిరిగి వారికి అందించమని కోరారు.
అనంతరం అయోధ్య పోలీసులు శ్రీధర్‌ను సంప్రదించారు. పర్సులో ఉన్న ఆధార్ కార్డు, పూజ సామాగ్రి, నగదు రూ.66,290ను తిరిగి తీసుకోవాలని శ్రీధర్‌కు సూచించారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ బుధవారం రామాలయానికి వెళ్లారు. ఎస్‌ఎస్‌ఎఫ్ ఇన్‌ఛార్జ్ యశ్వంత్‌సింగ్ శ్రీధర్‌కు పర్సును అందజేశారు. రాముడి ఆశీర్వాదం వల్లే పర్సు దొరికిందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.