గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు. అయితే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పట్టణంలో ప్రజా పంపిణీకి ఉపయోగిస్తున్న ఎమ్‌డియు వాహనాలను, రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎమ్‌డియు వాహనాన్ని పరిశీలించిన మంత్రి అక్కడే ఉన్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఆపరేటర్ వద్ద ఉన్న రేషన్ కార్డులను పరిశీలించారు. వాహనం వద్ద ఉన్న లబ్ధిదారులు కాకుండా అదనంగా రేషన్ కార్డులు ఉండటాన్ని ప్రశ్నించారు. దీనిపై ఆపరేటర్ నుంచి సరైన సమాధానం రాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరకులను, తూకాలను పరిశీలించారు. సరుకుల్లో వ్యత్యా సాన్ని గుర్తించారు. ఈ-పాస్ మిషన్‌లో సరకుల పంపిణీ వివరాలను ఇవ్వాల్సిందిగా ఆపరేటర్ను కోరడంతో ఆ సౌకర్యం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో అక్కడే ఉన్న సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్‌తో మాట్లాడారు.
సరుకులో వ్యత్యాసంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు బజార్‌ను పరిశీలించి కూరగాయల వ్యర్థాలను సైడ్ డ్రెయిన్లో వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుడు బండ్లపై ఉన్న ధరల కంటే రైతు బజారులో టమోటా ధరలు అధికంగా ఉండటంపై ఎస్టేట్ ఆఫీసర్‌ను నిలదీశారు. బియ్యం, కందిపప్పు పంపిణీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల నిర్వహణకు సమయపాలన పాటించకపోవడాన్ని గుర్తించి షాపుల నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.