వరుస హిట్ పాటలతో , తనదైన గాత్రంతో ప్రస్తుతం ఉన్న ప్రొఫెషనల్ సింగర్స్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. మంగ్లీ ఇటీవల కాలంలో పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి. దీంతో మంగ్లీ కి డిమాండ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విపరీతంగా కనిపిస్తుంది. మంగ్లీ ఏ పాట పాడిన ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతున్నారు. ఆమె పాడింది ఐటమ్ సాంగ్ అయినా ఫోక్ సాంగ్ అయినా హిట్ కావాల్సిందే అన్నట్టు మారింది పరిస్థితి.
అయితే సింగర్ మంగ్లీ ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరైంది. అక్కడ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె నురుగా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా ఈవెంట్ ముగిసిన తర్వాత అంటే అర్ధరాత్రి సమయంలో మేఘ్‌రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్ బయలుదేరింది.
బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా వెళ్తోన్న సమయంలో శంషాబాద్ మండలం తొండుపల్లి బ్రిడ్జి వద్ద మంగ్లీ కారుకు ప్రమాదం జరిగింది. అయితే మంగ్లీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో డీసీఎం కారును ఢీకొట్టడంతో మంగ్లీ కి ఆమెతో ప్రయాణించిన మేఘరాజ్, మనోహర్ లకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. మంగ్లీ కారును ఢీ కొట్టిన డీసీఎం వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు.
డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో మంగ్లీ కారు వెనుక భాగం బాగా దెబ్బతింది. ఏది ఏమైనా ప్రముఖ గాయని మంగ్లీ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ వార్త తెలిసిన మంగ్లీ ఫ్యాన్స్ మొదట ఆందోళన చెందినా , ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.