నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతోంది. అయితే పేపర్ల లీకులు, కోర్టు కేసులు, పరీక్షలు వాయిదా పడడంతో నిరాశ చెందింది. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్దు బర్లను కాస్తూ ఓ వీడియో చేసింది.
అయితే నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే తనను చంపేస్తామని కొందరు భయపెట్టారని, కానీ తాను ధైర్యంగా బరిలో నిలిచానని బర్రెలక్క అలియాస్ శిరీషా చెబుతోంది. వినూత్న ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతున్న బర్రెలక్కకు తానున్నానంటూ యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయల విరాళం పంపించారు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నిరుద్యోగి శిరీషా తనకు ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, భవిష్యత్ ను మారుస్తానని చెబుతూ ప్రచార హోరు సాగిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుద్యోగిని బర్రెలక్క(శిరీష) రాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘బానిస లాంటి బతుకు వదులుకో.. కదలిరారా యువత.. పేదబిడ్డ మన బర్రెలక్కకు ఓటు వేద్దమన్న… దొరల పాలన దోపిడి రాజ్యం’’ అంటూ ఎన్నికల ప్రచార సాంగ్ తో ఓటర్ల ముందుకు వెళుతోంది.