అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్కి వళ్లి నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్కి వెళ్లారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు.
అయితే బాలకృష్ణ అక్కడ నుంచి వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలిగించారు. బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలిగించారనే ప్రచారం జరుగుతోంది. దీని పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
విజయవాడలో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు, అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు కంటతడి పెట్టిన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్పందన పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, చంద్రబాబు పాల్గొన్న సమావేశాలతో పాటుగా టీడీపీ సభల్లో తారక్ అభిమానులు తమ హీరో జెండాలతో ప్రదర్శనలు చేస్తున్నారు. తారక్ సీఎం అంటూ నినాదాలు కొనసాగిస్తున్నారు.