భీమవరంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ .. బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతున్నారు. బీజేపీ ముఖ్యనేత అమిత్ షాతో సీట్ల సర్దుబాటు అంశంపై పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ ఖరారు కావడంతో.. ఏపీలో పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్..
నేరుగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడ నర్సాపురం పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్న విషయాన్ని ఈ సమావేశంలోనే పవన్ కల్యాణ్ వారికి తెలియజేశారు. అయితే గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్.. మళ్లీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది.
ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ మరోసారి భీమవరం నుంచి పోటీ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. భీమవరం నుంచి పోటీ చేసే విషయంలో స్పష్టత ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తన ఢిల్లీ పర్యటన ద్వారా ఏపీలో పొత్తులపై నెలకొన్న సస్పెన్స్‌కు కూడా తెరదించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశమైతే.. పొత్తులపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్టే అనే చర్చ జరుగుతోంది.