తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఫోకస్ చేశారు. దీనికోసం ప్రాధమికంగా వివిధ అంశాలను వారు పరిశీలిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదికారులకు చెప్పారు.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు. హెల్త్ కార్డుల్లో ఏముంటాయి..ఈ కార్డు ద్వారా వ్యక్తి ప్రస్తుత ఆరోగ్యం, అనారోగ్యాల పరిస్థితులు, చికిత్స, ఉపయోగిస్తున్న మందులు, సమస్, డాక్టర్ల అభిప్రాయం లాంటి అంశాలుంటాయి.
వీటన్నింటినీ డిజిటల్ రూపంలో రికార్డ్ చేయనున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్ళినా ఈ కార్డులు పని చేస్తాయి. వీటి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివరాలు తెలుసుకుని డాక్టర్లు వైద్యం అందిచడానికి ఉపయోగపడతాయి. కార్డులు ఎలా ఇష్యూ చేస్తారు.. డిజిటల్ హెల్త్ కార్డుల జారీలో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఎత్తు, బరువు, పొడువు లాంటి వివరాలతో పాటూ రక్త, మూత్ర పరీక్షలు చేసి..ఆరోగ్య సమస్యలు గుర్తించి కార్డుల్లో నమోదు చేస్తారు.
సమస్యలుంటే ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి చికిత్స అందిస్తారు. హెల్త్ కార్డుల్లో నమోదు అయిన వెంటనే వారికి వైద్య సాయం అందుతుంది. వీటిని ఎక్కడుకు తీసుకెళ్ళినా గుర్తింపు సంఖ్య నమోదు చేయగానే వివరాలు అన్నీ వచ్చేస్తాయి. డిజిటల్ డేటాను భద్రపరుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ విభాగం సమన్వయంతో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.