ఒక మహిళ ప్రభుత్వం నుంచి తనకు అందిన సంక్షేమాన్ని మీడియాలో చెబితే ఓర్చుకోలేక ఐటిడిపి ఒక ఉగ్రవాద సంస్థలా మారి ఆత్మహత్య చేసుకునేదాకా వేటాడిందని వైసిపి మహిళా విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తెనాలిలో గీతాంజలి ఆత్మహత్యకు టిడిపి, జనసేన సోషల్ మీడియానే కారణమని అన్నారు.
కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియా ద్వారా టిడిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి కుంటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంగళవారం ఆదేశించారు.
ఈ మేరకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేసియాను గీతాంజలి కుటుంబ సభ్యులకు అందజేయాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, మర్యాదలకు భంగం కలిగించే వారిపట్ల చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని సిఎం పేర్కొన్నారు.