చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే విక్రమ్, ప్రగ్యాన్‌లు సక్రమంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ రెండింటిపైన ఉన్న సోలార్ ప్యానెల్‌ల ద్వారానే వీటికి శక్తి అందుతుంది. చంద్రుడిపై సూర్యాస్తమయం అయితే మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కాబట్టి ల్యాండర్, రోవర్‌లకు శక్తి అందదు. అయితే చంద్రుని వెలువల నుంచి విక్రమ్, ప్రజ్ఞాన్ సరికొత్త ముప్పును ఎదుర్కోనున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జాబిల్లి ఉపరితలాన్ని తరచూ మైక్రోమెటరాయిడ్స్ ఢీకొడుతుంటాయని, వీటిని కూడా అవి ఢీకొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మైక్రోమీటోరాయిడ్లు అంటే రాళ్లు, లోహాలతో కూడిన చిన్నపాటి ఉల్కలు. ఇవి సౌర వ్యవస్థలోని పెద్ద లోహాలు, శిలల వంటి వాటి నుంచి ఊడిపడి చిన్న ముక్కలుగా చంద్రుడ్ని ఢీకొడుతుంటాయి. ఇవి ఢీకొట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తాజాగా, ఇస్రో సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ… ల్యాండర్, రోవర్‌ను మైక్రోమీటోరాయిడ్లు ఢీ కొట్టే ముప్పు ఉందని అన్నారు. గతంలో జాబిల్లిపై పరిశోధనలకు ప్రయోగించిన అపోలో సహా పలు మిషన్ల విషయంలో ఇదే జరిగిందని ఆయన గుర్తుచేశారు.
సాధారణంగా ల్యాండర్, రోవర్‌లకు తుప్పు పట్టే వాతావరణం జాబిల్లిపై లేకపోయినప్పటికీ మైక్రోమీటోరాయిడ్లు ఊడిపడేటప్పుడు లూనార్ నైట్‌లో ఉండే ఉష్ణోగ్రత పరిస్థితుల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని మణిపాల్ సెంటర్ ఫర్ నేచురల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకుమార్ వ్యాఖ్యానించింది. అయినప్పటికీ చివరకు ల్యాండర్, రోవర్‌కు ఏం జరుగుతుందన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు. కాగా, చంద్రయాన్-3 ల్యాండర్ జాబిల్లిపై తన పనిని సమర్థవంతంగా పూర్తిచేసి ఇప్పుడు హాయిగా నిద్రపోతోందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఇటీవలే చెప్పారు.
ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రస్తుతం సిగ్నల్స్ అందడం లేదు. ‘చంద్రునిపై ఆక్సిజన్ సహా వాతావరణం లేనందున సూర్యుని నుంచి నిరంతర రేడియేషన్ ప్రభావం ఉంటుంది.. ఇది కూడా కొంత నష్టం కలిగించవచ్చు.. అయితే, దానికి సంబంధించిన సమాచారం లేనందున ఏం జరుగుతుందో ఇంకా తెలియలేదు’ అని శ్రీకుమార్ పేర్కొన్నారు.