తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటుల్లో ఒకరిగా చంద్రమోహన్ పేరుగాంచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల సమయంలో యువకుడిగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఆయన హీరోగా ఎన్నో విజయాలను అందుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన సినీ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు.
అయితే, చంద్రమోహన్ ఆరోగ్యం బాగోలేదని ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆయన స్వయంగా స్పందిస్తూ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన వెండితెరపై వెలిగారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారందరూ తొలుత చంద్రమోహన్ సరసన నటించిన వారే.
ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉంది. అది నిజం కూడా. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించినవారే.1942 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. 932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు.