కరోనా సమయంలో 2020లో నిహారిక కొణిదెల-చైతన్య జొన్నలగడ్డ వివాహం జరగ్గా.. పెళ్లయిన ఏడాదిలోపే ఈ జంట విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. అలా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ విడాకుల గురించి అధికారికంగా ప్రకటన చేశారు. అయితే నిహరిక విడాకుల అనంతరం తాను ఎదుర్కొన్న విషయాలను పంచుకుంది. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారి సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్త నిహారక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డకు కూడా చేరింది. దీంతో నిహారిక చేసిన వ్యాఖ్యలపై చైతన్య స్పందించాడు. హోస్ట్ నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇంటర్వ్యూకు సంబంధించి ఓ పోస్టు చేశాడు.
ఆ పోస్టు కింద చైతన్య జొన్నలగడ్డ కామెంట్ చేశాడు. ‘హాయ్ నిఖిల్. నిహారిక ఎదుర్కొంటున్న పరిస్థితిని దూరం చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. వ్యక్తిగతంగా దూషిస్తూ జరుగుతున్న దుష్ప్రచారం తట్టుకోవడం అంతా సులభం కాదని నాకు తెలుసు. ఇలాంటివి చేసేటప్పుడు దానికి కారణమైన వారిని ట్యాగ్‌లు చేయడం నియంత్రించాల్సి ఉంది. ఇలాంటిది జరగడం రెండోసారి. విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. రెండు వైపులా ఆ బాధ, కష్టం ఒకేలా ఉంటుంది. విడాకుల గురించి మాట్లాడకూడదు. అందులోనూ ఒకవైపే మాత్రమే తీసుకుని మాట్లాడడం సరికాదు.
ఆ బాధ ఎలా కోలుకున్నామనే విషయంపై మాట్లాడితే అందరికీ ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. జరిగింది ఏమిటో తెలుసుకోకుండా తీర్పునివ్వడం ఎంత తప్పో.. ఇలాంటి వేదికల ద్వారా ప్రజలకు ఒక కోణంలోనే చెప్పడం కూడా అంతే తప్పు అని అనుకుంటున్నా. దీన్ని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా’ అని చైతన్య జొన్నలగడ్డ కామెంట్ చేశాడు. తన కామెంట్ ద్వారా చైతన్య తప్పు ఇద్దరి వైపు ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు.
నిహారిక చెప్పిన దాంట్లో తప్పంతా తనదే అన్నట్టు చెప్పినట్లు చైతన్య భావిస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో జరిగిన ఇలాంటి పరిణామంపై ఆచూతూచి స్పందించాల్సి ఉంటుందని చైతన్య హితవు పలికాడు. విడాకులతో ఇరు కుటుంబాలు బాధకు గురయ్యి ఉంటాయని.. కానీ కేవలం ఒక కుటుంబమే బాధపడినట్లు ఇంటర్వ్యూ ఉండడాన్ని చైతన్య సహించలేకపోతున్నాడు. అలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఈ సుదీర్ఘ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ ద్వారా మరోసారి మాజీ భార్యాభర్తల మధ్య కొత్త వివాదానికి దారి తీసింది. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.