ప్రలోభాలకు, బెదిరింపులకు, దాడులకు తాను భయపడబోనని బర్రెలక్క తేల్చి చెప్పింది. ప్రాణం పోయినా సరే పోరాటం ఆపబోనని స్పష్టం చేసింది. బర్రెలక్కపై దాడి జరగడంతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బర్రెలక్కకు ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
అయితే ఏదో ఆషామాషీగా ఆమె పోటీచేయడం లేదు… సీరియస్ గా గెలుపుకోసం పోరాడుతున్నారు. కొల్లాపూర్ లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఆమె ప్రచారం చేస్తుండగా కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి యత్నించారు. ఈ దాడినుండి శిరీష తప్పించుకున్నా ఆమె సోదరుడు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు.
ఇలా తనపై దాడికి భయపడిపోకుండా రక్షణ కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు బర్రెలక్క. కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న తనకు ప్రాణహాని వుందని… 2+2 గన్ మెన్ల రక్షణ కల్పించాలంటూ శిరీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల కమీషన్ ను ఆదేశించాలని ఆమె కోరుతోంది. ఈ పిటిషన్ పై విచారణ జరపనున్న న్యాయస్థానం తీర్పును కూడా ఇవాళే వెలువరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.