చంద్రబాబుకు బెయిల్ అంటూ కోర్టు నుంచి వార్త అందగానే ఇన్నాళ్లూ నిరూత్సాహవదనంలో ఉన్న టీడీపీ శ్రేణులన్నీ ఉత్సాహంతో ఎగిరిగంతేశాయి. అధినేతకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాయి టీడీపీ శ్రేణులు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పొంది రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు విడుదల సందర్భంగా జైలు వద్ద కోలాహలం మామూలుగా లేదు.
వేలాదిగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలతో రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాలు జాతరను తలపించాయి. చంద్రబాబు విడుదల అవుతున్నారని తెలిసి నందమూరి బాలకృష్ణ కూడా జైలు వద్దకు వచ్చారు. తన కుమార్తె బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ లతో కలిసి జైలు వద్దకు వచ్చిన బాలయ్య… చంద్రబాబును చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. బావ పట్ల విధేయతను చాటుతూ చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.
చంద్రబాబు ఆప్యాయంగా బాలయ్యను పైకి లేపారు. ఆపై, ఇరువురు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కాగా, బాలకృష్ణ తన బావ చంద్రబాబు క్షేమం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు చేయించారు. దానికి సంబంధించి ఆశీర్వాద ఫలాన్ని ఆయన జైలు వెలుపల చంద్రబాబుకు అందించారు.