బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీగా తరలివెళ్లారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ రోడ్డుమార్గాన కరీంనగర్ జిల్లాకు చేరుకుని, అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులకు భరోసా ఇవ్వనున్నారు. అయితే సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు కేసీఆర్ ‘‘పొలం బాట’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు. బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో పర్యటించి సాగునీటి సమస్యలను తెలుసుకుంటారు. అయితే కేసీఆర్ పొలంబాట కార్యక్రమాన్ని ప్రకటించగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో బీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు జిల్లాల్లో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కరువుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నేతలు కలెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని రామడుగు, గంగాధర మండలాల్లో పంట పొలాలు ఎండి పోతున్నాయని, సాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఎండిన పొలాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్-నిజమాబాద్ రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆ పార్టీ మాజీ మంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యరి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లిలో 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టారు.