రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది. ఇందులో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను మార్చి 13వ తేదీన ప్రకటించింది. ఆ తరువాత పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డాక్టర్ కడియం కవిత.. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా కలిశారు. అయితే కడియం శ్రీహరి పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కసి ఎక్కువగా వచ్చి ద్రోహి పోయిన ఆనందం కనిపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
కడియం శ్రీహరికి కల్పించినన్ని అవకాశాలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ కల్పించలేదు… నీతి- నిజాయితీ నైతిక విలువలు ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటున్నారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టేనని, పార్టీ మారిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు.
కడియం శ్రీహరి పార్టీ మార్పుతోనే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో కసి మరింత ఉత్సాహం పెరిగిందని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు ఛాన్స్ దొరికితే చాలు కడియం శ్రీహరి ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ఒకరి కంటే మరొకరు ఎక్కువ అన్నట్లు కడియం శ్రీహరి పై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ డీలా పడిందన్న టాక్ జరుగుతున్న సమయంలో కడియం శ్రీహరి లాగా బీఆర్ఎస్ కు ప్రచారాస్త్రం దొరికిందని జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.