ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. అయితే షర్మిల మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ వారసత్వం అంటే ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు. మహిళనని కూడా చూడకుండా తనను రాత్రి సమయంలో పోలీసు స్టేషన్లో ఉంచారని విరుచుకుపడ్డారు.
పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి గాయమైందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. నన్నే అరెస్ట్ చేపిస్తావా.. జగన్ నీ అంతు చూస్తా’ అంటూ సొంత అన్న, సీఎం జగన్‌కి షర్మిల మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు తన పరిస్థితిని చూసి తన తండ్రి దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో వినతి పత్రం ఇద్దామని వస్తే ఎవ్వరూ అందుబాటులో లేని పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి ఎందుకు రారని ప్రశ్నించారు.
చివరకు సీఎస్ కూడా సచివాలయంలో ఉండరన్నారు. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. ఏపీలో అసలు పరిపాలన లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కాపాడట్లేదని మండిపడ్డారు. పోలవరం ఇంకా పూర్తి చేయలేకపోయారని చెప్పారు. రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.