తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామివారి దర్శనానికి ఒక్కసారి 24 గంటల నుండి 48 గంటల వరకు సమయం పడుతూ ఉంటుంది.అయితే ఆ విధంగా క్యూ లైన్ లో వేచి చూస్తున్న సమయంలో స్త్రీలకు నెలసరి వస్తే ఏం చేయాలి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. ఒక్క తిరుమల క్యూలైన్ లో ఉన్న స్త్రీలు మాత్రమే కాదు.. సాధారణంగా ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు అనుకోకుండా నెలసరి (పీరియడ్స్) వస్తే ఏం చేయాలి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మామూలుగా అయితే ఇంటిలో అంటు ముట్టు అంటూ నెలసరి సమయంలో పూజా కార్యక్రమాలకు మహిళలు దూరంగా ఉంటారు.
స్త్రీలు వెలుపల ఉన్న సమయంలో గుడికి వెళ్లకూడదు.. దీపం పెట్టకూడదు.. ముట్టుకోకూడదంటూ చెబుతుంటారు.. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో స్త్రీలు దేవాలయాల్లోకి వెళ్లడాన్ని చాలా మంది అపవిత్రమని భావిస్తుంటారు. కనీసం ఆలయ పరిసరాల్లోకి కూడా వెళ్లకూడదని చెబుతుంటారు.. అదే గుడిలో ఉన్న సమయంలో కనుక నెలసరి వస్తే ఏం చేయాలి? దాని వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెలసరి అనేది ప్రతి స్త్రీకి వచ్చేదే. అయితే గుడిలో పీరియడ్స్ రావడం వలన ఎటువంటి దోషాలు కలగవని చెబుతున్నారు.
దేవాలయాల్లో ఉన్న సమయంలో కనుక స్త్రీలకు పీరియడ్స్ వస్తే వెంటనే లోపలి నుంచి బయటకు వచ్చేయాలి.. దర్శనానికి వెళ్లకుండా అలాగే దర్శనానికి వెళ్లే వారిని ముట్టుకోకుండా వచ్చేయడమే మార్గమని చెప్పుకోవచ్చు. అంతేకానీ దేవాలయంలో ఇలా జరిగిందేంటి అని బాధ పడాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు.. గుడిలో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చాయి.. ఇది పాపం, దోషం అనిపించడంతో ఏమైనా చెడు జరుగుతుందేమోనన్నది కేవలం మన ఆలోచనలు మాత్రమే.. ఎందుకంటే నెలసరి అనేది ప్రతి స్త్రీకి సాధారణమని వ్యాఖ్యానిస్తున్నారు.