ఎప్పుడూ నవ్వుతూ ఉండే సునీత చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెల్సిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సునీత తన లైఫ్ గురించి.. తాను పడ్డ కష్టాల గురించి ఓపెన్ అయ్యింది. తను చాలా విషయాల్లో మోసపోయానని.. చిన్న వయసులోనే పెళ్లి.. పిల్లలు.. ఆవిడ తండ్రికి వ్యాపారంలో నష్టాలు.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అయితే మూడేళ్ల క్రితం రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న తర్వాత సింగర్ సునీత పేరు బాగా వైరల్ అయింది. ఆమె వ్యక్తిగత జీవితంపై ట్రోల్స్ మొదలయ్యాయి.
అయితే, వీటన్నింటికీ ఆమె దీటుగా సమాధానం ఇచ్చారు. తాజాగా, ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. వ్యక్తిగత జీవితం గురించి రికార్డింగ్ స్టూడియోలో చర్చించాల్సిన అవసరం లేదని, వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం వేర్వేరని చెప్పారు. గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్లినట్టుగానే, స్టూడియోలోకి కూడా వెళ్తానని పేర్కొన్నారు.
‘నువ్వు రిలేషన్‌లో ఉన్నావా?’, ‘నీ జీవితంలో ఏం జరిగింది?’, ‘నీ దగ్గర డబ్బుందా?’ లాంటి ప్రశ్నలకు అక్కడ తావులేదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని వదిలేసి స్టూడియోలో అడుగుపెట్టినప్పుడే సంతోషంగా ఉండగలుగుతామని పేర్కొన్నారు. తాను చాలా మృదుస్వభావినని, ప్రతిదానికీ కన్నీళ్లు పెట్టుకుంటానని తెలిపారు. అలా ఏడవకపోతే తాను అర్టిస్ట్‌ను ఎలా అవుతానని ప్రశ్నించారు. తన నవ్వు చాలా ఫేక్‌గా ఉంటుందని చాలామంది కామెంట్ చేశారని, కానీ తానెప్పుడు అలా నవ్వుతానో తనకు బాగా తెలుసన్నారు. తనకు ప్రకృతే దేవుడని తేల్చి చెప్పారు.