జైలులో ఉన్న చంద్రబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష్య సాధింపు ను జనంలోకి తీసుకెళ్లాలన్నా లక్ష్యంతో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. ఇందు కోసం పార్టీ యంత్రాంగం ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేసింది. నారావారిపల్లి నుంచి టీడీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అయితే అవినీతి కేసుల్లో అరెస్టు అయ్యి చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులుగా ఉన్నారు. న్యాయస్థానాల్లో ఆయనకు ఊరట దక్కడం లేదు. సెప్టెంబర్ 10న నంద్యాలలో ఉన్న చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.
అయితే నాటి నుంచి ఆయన కుటుంబం నలు దిక్కులు గా మారింది. పాదయాత్ర చేస్తున్న లోకేష్.. ఆకస్మికంగా నిలిపివేసి తండ్రి కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణీలు రాజమండ్రి చేరుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ తాత గారి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే ఇంతవరకు చంద్రబాబు అరెస్టు విషయం మనుమడు దేవాన్ష్ కు చెప్పలేదట. ఈ విషయాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలకు “నిజం గెలవాలి” పేరిట పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే.
తిరుపతి జిల్లాలో ఓ సభలో భువనేశ్వరి ఉద్విగ్నంగా ప్రసంగించారు. మనుమడు దేవాన్ష్ కు ఇంతవరకు తాత చంద్రబాబు అరెస్ట్ విషయం చెప్పలేదని.. ఆ చిన్నారిపై ప్రభావం చూపుతోందని ఈ విషయాన్ని దాచి వేసినట్లు భువనేశ్వరి చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన గంభీర్య వాతావరణం చోటుచేసుకుంది. నాయనమ్మ స్థానంలో ఉన్న భువనేశ్వరి వ్యక్తం చేసిన బాధను చూసి టిడిపి శ్రేణులు తల్లడిల్లిపోయాయి. ఈ ఏడాది జనవరిలోనే కుమారుడు దేవాన్ష్ కు లోకేష్ దూరమయ్యారు. యువ గళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నారు.
అటు తాత చంద్రబాబు సైతం నిత్యం ప్రజల్లో ఉండడంతో మనుమడు దేవాన్ష్ కు అందుబాటులో ఉండడం తక్కువే. అయితే ఇప్పుడిప్పుడే లోకజ్ఞానం వస్తున్న తరుణంలో అటు తండ్రి పాదయాత్ర చేపడుతుండగా.. తాత అవినీతి కేసుల్లో అరెస్టు అయ్యి జైల్లో ఉండడంతో.. ఆ విషయాన్ని దేవాన్ష్ కు తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బయటకు వ్యక్తం చేసే సమయంలో భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబంలో ఐదుగురు.. తలో దిక్కుగా మారిపోయామని చెప్పడాన్ని టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.