సీనియర్ నరేష్ .. అలనాటి మేటి నటి.. దర్శకురాలు , నిర్మాత విజయనిర్మల ఒక్కగానొక్క కొడుకు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. సూపర్ స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్న తర్వాత.. నరేష్.. కృష్ణ దగ్గరే పెరిగాడు. ఇక విజయ నిర్మల ఆస్తి మొత్తానికి నరేష్ వారసుడు. బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టిన నరేష్.. హీరోగా కెరియర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో పలు సినిమాల్లో నటించాడు. అప్పట్లో పారితోషకం కూడా బాగానే తీసుకునేవాడనే టాక్..అయితే ఇంటర్వ్యూస్ లో తన గురించి, తండ్రి గురించి, తండ్రి పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నవీన్ విజయ్ కృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయనిర్మల ఆస్తి వివరాల గురించి మాట్లాడాడు.
నానమ్మ (విజయనిర్మల)కు సంబంధించిన ఆస్తులలో సగభాగం నాకు రాయాలని మా నాన్నను కోరింది. ఆమె అప్పుడే ఆ వీలునామా రాసి ఇస్తానని కూడా చెప్పింది. తన ఆస్తిలో సగభాగం నాకు.. ఇంకో సగభాగం నాన్నకు ఇవ్వాలని ముందే అనుకుంది. అయితే నేనెప్పుడూ ఈ ఆస్తుల గురించి పట్టించుకునే వాడిని కాదు. ఇక కొన్ని రోజుల తర్వాత నేను, నాన్న ఈ ఆస్తి విషయంలో ఒక అవగాహనకు వచ్చాము. ఆ తర్వాత నానమ్మ మొత్తం ఆస్తి మా నాన్న పేరు మీదే రాసింది. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్. ఆయన కూడా నా తర్వాత ఎలాగూ ఈ ఆస్తి నీకే చెందుతుంది కదా అని చెప్తారు.
అసలు మా ఆస్తి వివరాలు పై నాకు అంత అవగాహన లేదు. నాకు తెలిసి నాన్న పర్యవేక్షణలోనే మేము ఉండాలని కోరుకుంటున్నాము. నాన్నకు నాకు మధ్య ఆస్తి తగాదాలు ఏమీ లేవు. నేను కానీ.. నాన్న కానీ ఆ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా సంపాదించింది లేదు. అదంతా నానమ్మ ఆస్తి. దానికి నాన్న గార్డియన్ గా మాత్రమే ఉన్నారు. నాన్న తర్వాత ఆ ఆస్తిని భద్రంగా చూసుకునే బాధ్యత నా మీద ఉంది. నాకు నా తమ్ముళ్లు రణవీర్, తేజ ఇద్దరు ఇష్టమే. ముఖ్యంగా తేజ అంటే నాకు ప్రాణం. వాడితో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాను. వాడికి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇక నవీన్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.